×

మళ్ళీ వచ్చిన వసంతం!

మంచు విడిపోయింది. వాడిపోయిన ఆకులన్నిటినీ రాల్చేసి, బోడిగా మిగిలిన చెట్లన్నీ ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త చిగుర్లు వేయటం మొదలెట్టాయి.

ప్రొద్దునే పక్షుల కిలకిలలు మొదలయ్యాయి, ముఖ్యంగా కోయిల కూతలు! మామిడి చెట్లని చూస్తే ముచ్చట వేస్తున్నది: లేత ఆకుపచ్చరంగులో మెరిసే ఆకుల సొగసు బలే ఉంది. చిట్టి చిట్టి మామిడి కాయలు వచ్చాయి. ఇన్నాళ్ళూ ఎక్కడో దాక్కున్న మొక్కలు ఇప్పుడు మళ్లీ అందరికీ కనిపించాలని ముస్తాబవుతున్నట్లు ఉన్నాయి. నేల బారుగా పరుచుకున్న గడ్డి మొక్కలన్నీ రంగురంగుల పూలు తొడిగాయి. ఇంట్లో చాలా రోజులుగా ముడుచుకొని ఉన్న గులాబి మొగ్గ ఇవాళ్లే విచ్చుకున్నది. అందమైన రెక్కల్ని సవరించుకుంటూ అన్ని వైపులకూ కలయ జూసింది. క్రింద, నేల బారుగా పరచుకొని ఉన్న గడ్డి చేమంతుల్ని చూసీ చూడనట్లు చూసి, 'తన స్థాయి వాళ్ళు కారు' అన్నట్లు వేరే వైపుకు తల తిప్పుకున్నది.

దగ్గర్లోనే ఉన్న గడ్డి చేమంతి నవ్వుతూ పలకరించింది దాన్ని. "బాగున్నావా, చెల్లెమ్మా?! ఎంత అందంగా ఉన్నావమ్మా! నిన్ను చూస్తే మా అందరికీ ఎంతో గొప్పగా ఉంటుంది" అన్నది స్నేహంగా.

గులాబీ దానికేసి తిరస్కారంగా చూసింది- "మావాళ్లెవరూ ఇంకా వచ్చినట్లు లేరు?!" అంటూ మూతి ముడుచుకున్నది. "గులాబీలా?! లేదమ్మా! ఇంకా లేదు. నువ్వే, మొదటి దానివి! మా గడ్డిచామంతులైతే దండిగా వచ్చేసాయి!" చెప్పింది ఆ పువ్వు. "ఇంకా లిల్లీలు కూడా రాలేదు. ఈ పాటికి వచ్చేయాల్సింది మరి-"

"వచ్చేసాం! వచ్చేసాం!" వినిపించింది ఒక గొంతు. చూడగా అది లిల్లీ! లిల్లీ పువ్వు గొంతు విప్పగానే సుగంధాలు అక్కడ అంతటా పరచుకున్నాయి. "బాగున్నారా అంతా?! వసంతంలో మేమూ మీరూ అందరం ఎన్నెన్ని కబుర్లు చెప్పుకున్నామో, గుర్తుందా?" అన్నదది.

గులాబీ తిరస్కారంగా ముఖం తిప్పుకున్నది. "వికారపు పూలు, వికారపు మాటలు!” అనుకున్నది. "ఆశ్చర్యమేమున్నది? అందరూ గులాబీలనే ఇష్టపడుతారు ఇందుకనే!"

అంతలో తొలి కిరణం ఒకటి వచ్చి వాలింది. అది రాగానే అక్కడంతా వెచ్చదనం పరుచుకున్నది. "ఏమ్మా! అంతా బాగున్నారా?" అన్నది తొలి కిరణం. అట్లా అంటూనే మరోవైపున గులాబీతో గుసగుసగా చెప్పింది- "నాకు మాత్రం నువ్వంటేనూ ఇష్టమే; గడ్డి చేమంతులన్నా ఇష్టమే; లిల్లీలంటే కూడా ఇష్టమే!" అని.

గులాబి ముఖం ఇంకా ఎర్రగా ఐపోయింది. "కాదు! నేనొక్కదాన్నే అందమైన దాన్ని! అందరికి నేనంటేనే ఇష్టం కావాలి! అంతే!” అని అరిచింది. ఆ అరుపుకు మిగిలిన పూలన్నీ బెదిరిపోయాయి. చిన్నబోయి చటుక్కున తలలు వాల్చుకున్నాయి.

అంతలో గందరగోళంగా, రంగులు రంగులుగా ఎగురుకుంటూ వచ్చింది, ఓ సీతాకోక చిలుకల దండు. అన్ని పూల మీదా వాలి, అన్నిటితోటీ ముచ్చట్లు పెట్టాయవి.

"కాదు- అందరూ నా దగ్గరికే రండి!" అని అరుద్దామనుకున్నది గులాబీ. అయినా "అన్నీ ఒకేసారి వచ్చి పడితే ఎలాగ?" అని ఊరుకున్నది.

సీతాకోక చిలుకలు, ఆ తర్వాత తుమ్మెదలు, తేనెటీగలు- అన్నీ వచ్చి సందడి చేసినై; పూలన్నిటినీ పేరుపేరునా పలకరించినై; ఎక్కడెక్కడి సంగతులూ చెప్పినై వాటికి! సంతోషం నిండిన ఆ వాతావరణంలో గులాబీ కూడా 'తను వేరు' అనుకోవటం మర్చిపోయింది.

ఆ రోజు రాత్రి పడుకోబోతూ, "సువిశాలమైన యీ ప్రకృతిలోని అనంత వైవిధ్యంలో నేనూ ఒకదాన్ని !” అనుకున్నది అది తృప్తిగా.

నిజంగానే సంతోషం అన్ని భేదాలనూ పోగొడుతుంది!

మీకందరికీ నవ వసంతపు శుభాకాంక్షలు!!

 


Source : http://kottapalli.in/2017/03/welcome

[Contributed by administrator on 15. März 2018 16:35:45]



New comment(s) added. Please refresh to see.
Refresh ×
Submit
×