×

కూరగాయల లోకం

రచన: కరీనా అంజుం, ఎనిమిదవ తరగతి, ప్రసాద్ ఇం. మీ. స్కూల్, అనంతపురం.

అనగనగా ఒక లోకం. ఆ లోకం పేరు కూరగాయల లోకం. ఆ లోకంలో అందరూ కలిసి మెలసి ఆనందంగా ఉండేవారు. ఒకరికి కష్టం వస్తే అందరూ సహాయపడేవారు.

వారికి రాజు వంకాయ. అందరినీ సమానంగా చూసేవాడు; అందరికీ ఎంతో సహాయం చేసేవాడు.

అయితే అనుకోకుండా ఒక రోజున ఆ లోకంలోకి ఒక బెండకాయ ప్రవేశించింది. బెండకాయ అక్కడి వాళ్లందరినీ చూసి అసూయ పడింది. "వీళ్లందరికీ పోట్లాట పెట్టాలి. ఎలాగైనా రాజునుండి దూరం చేయాలి. రాజుని మోసంచేసి డబ్బులు ఎత్తుకుపోవాలి" అనుకున్నది. .

అనుకున్నట్లే అది మెల్లగా ఒకరికి ఒకరికి మధ్య చిచ్చులు పెట్టింది. టొమాటో ఉల్లి మంచి స్నేహితులు. వీళ్లని దూరం చేసింది బెండకాయ. అలాగే అందరికీ ఒకరంటే ఒకరికి పడకుండా చేసింది.


ఒకవైపున ఇలా చేస్తూ, మరొకవైపున అది వంకాయరాజు దగ్గరికి వచ్చి "వందనాలు మహారాజా! టొమాటోకి జ్వరం వచ్చింది- డబ్బు అవసరం" అంది. "సరే"నని వంకాయరాజు డబ్బు తీసి ఇచ్చాడు.

అట్లాగే మరొక రోజున వచ్చి "ఉల్లికి కూడా జ్వరం వచ్చింది ప్రభూ!" అంటే వంకాయ రాజు జాలిపడి మళ్లీ ఇంకొంత డబ్బు ఇచ్చాడు బెండకాయకి.

అట్లా దుబారా డబ్బుకి అలవాటు పడిన బెండకాయ రోజూ వంకాయ దగ్గరికి వచ్చి, ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి డబ్బు తీసుకొని వెళ్తోంది. కొన్నాళ్ళు ఇలా గడిచాక, వంకాయ రాజుకి బాధ వేయసాగింది- "అసలు నాలోకంలో ఇంత మందికి బాగా లేదు. అందరూ రోగాలతో కొట్టుమిట్టాడుతున్నట్లున్నారు. ఇంత బాధల్లో ఉన్నవాళ్లని పలకరించకపోతే ఏం బాగుంటుంది? నేను అందరినీ ఒకసారి చూసి వస్తాను" అని బయలుదేరాడు వంకాయ రాజు. చూస్తే రాజ్యంలో పరిస్థితి బాగాలేదు- అందరూ ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. ఒకరినొకరు తిట్టుకుం-టున్నారు.

వంకాయ రాజు అందరినీ అడిగాడు- "ఎందుకు, మీరు ఇలా కొట్లాడుతున్నారు?' అని. అందరూ ఒకరిమీద ఒకరు చెప్పుకోవటం మొదలెట్టారు.. వాళ్ల మాటలన్నీ విని, రాజు ఓపికగా వాళ్ల సమస్యలను అన్నింటినీ పరిష్కరించాడు. "ఊరికే కొట్లాడుకోవద్దండి- తోటి వాళ్లని గురించి తప్పుగా అనుకుంటూ ఉండద్దండి- మీకేమైనా అన్యాయం జరిగితే రాజుగారి దగ్గరికి పోండి" అని చెప్పాడు అందరికీ. ఆ తర్వాత అతను పోతుంటే, దారిలో టొమాటో కనిపించింది. రాజుగారు అడిగారు "నీకు జ్వరం అంట కదా, ఇప్పుడు బాగుందా?!" అని.

టొమాటో అతనికేసి వింతగా చూసింది. "నాకు జ్వరమా?! లేదే?! అసలు ఈమధ్య నాకు జ్వరమే రాలేదు!" అని చెప్పి వెళ్లిపోయింది.

వంకాయరాజుకు ఆశ్చర్యం వేసింది. అది అలాగే ఆలోచిస్తూ ఉల్లి ఇంటికి వచ్చి "ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది?" అని అడిగింది. ఉల్లి కూడా ఆశ్చర్యపోతూ "నాకేమయింది? బాగానే ఉన్నానుగా?" అన్నది.

వంకాయరాజు ఆలోచించుకుంటూ కోటకి చేరుకున్నది. "బెండకాయ ఎందుకు అబద్ధం చెప్పింది?" అని. దారిలో కాకరకాయ ఒకటి ఫోనులో మాట్లాడుతూ, వినిపించక అవస్థ పడుతున్నది. వంకాయరాజు దాని దగ్గరికి వెళ్ళి, ఫోనును పెద్దగా పెట్టి ఇచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి బెండకాయ ఫోన్‌లో మాట్లాడింది కాకరకాయతోటి: "అవును. నా దగ్గర చాలా డబ్బు ఉంది. అయినా నాకు ఇంకా చాలా డబ్బులు కావాలి. వంకాయ రాజు తిక్కవాడు. అతన్ని మోసం చేసి అతని దగ్గరున్న డబ్బులన్నీ పూర్తిగా దోచుకుంటాను. ఈ లోకంలో అందరికీ మధ్య పోట్లాటలు పెట్టేసాను. ఇప్పుడు ఎవ్వరూ కలసి ఉండటం లేదు" అని చెప్పసాగింది.

అది విన్న వంకాయ రాజుకు సంగతి అంతా అర్థమైంది. తనదగ్గర పనిచేసే మిరపకాయల సైన్యాన్ని పిలిచి బెండకాయను, దాని దగ్గరున్న డబ్బుతో సహా దర్బారుకు తెమ్మన్నాడు. కాకరకాయని కూడా పిలిచి నిలబెట్టి, దాని చేత నిజం చెప్పించాడు.

అప్పుడు బెండకాయ తన తప్పునంతా ఒప్పుకున్నది- "అవును. నేనే, ఈ లోకంలో అందరినీ ఒకరికొకరు దూరం అయ్యేట్లు చేశాను. ఎందుకంటే నాకు డబ్బు అవసరం" అని చెప్పింది.

అప్పుడు వంకాయ రాజు అన్నది-

"సరే- అయితే ఈ డబ్బు అంతా నువ్వే పెట్టుకో, ఏమీ పర్లేదు. కానీ ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ మళ్ళీ ఒక్కటిగా చేసి పో!" అని.

అప్పుడు సిగ్గుపడిన బెండకాయ లోకంలో ఉండే అందరినీ పిలిచి "నన్ను క్షమించండి- నేను మీ అందరి మధ్య దూరాన్ని పెంచాను. రాజుకు తప్పుడు మాటలు చెప్పి డబ్బులన్నీ దోచాను" అని ఒప్పుకున్నది. అప్పుడు అందరూ కలసి ఆ బెండ కాయను కూరగాయల లోకంలోకి రానివ్వకుండా చేశారు. అందరూ మళ్లీ ఆనందంగా కలిసి ఉండటం చూసి రాజుగారు సంతోషపడ్డారు.

[Contributed by administrator on 15. März 2018 17:54:42]

New comment(s) added. Please refresh to see.
Refresh ×
Comment
×

×
    Graphs